అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా భోళా. తమిళంలో తెరకెక్కిన ఖైదీ సినిమాకు రీమేక్ ఇది. కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ సినిమాకు తమిళంలోనే కాదు, తెలుగులోనూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆదా మే ఆదీ సాంగ్ విడుదలైంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది.
అజయ్‌దేవ్‌గణ్‌తో పాటు ఈ సినిమాలో అమలాపాల్, టబు కీ రోల్స్ చేస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ ``తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఉన్న అనుబంధాన్ని మించింది ఇంకేదీ లేదు. ఆదా మే ఆదీ ఓ పాటను విన్న ప్రతి ఒక్కరికీ తండ్రీ కూతురి మధ్య ఉండే బాండింగ్ అర్థమవుతుంది. చాలా ఎమోషనల్‌గా సాగే పాట ఇది. పాటను విన్న చాలా మందికి కన్నీళ్లు ఆగట్లేదని చెబుతున్నారు. ఎమోషనల్‌గా సాగుతుంది. తన కూతురుని కలవాలనుకున్న తండ్రి కథ ఇది. భోళా జర్నీ అంతా ఒక్క విషయాన్నే సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడని కూతురిని చూసుకోవడానికి ఓ తండ్రి చేసే ప్రయాణమే ఈ సినిమా`` అని అన్నారు.
పదేళ్లుగా జైలు శిక్ష అనుభవించిన ఖైదీగా నటించారు అజయ్ దేవ్‌గణ్. అతను జైలులోకి వెళ్లాక కూతురు పుడుతుంది. ఆమెను చూడాలన్న ఆతృతతో జైలు నుంచి వచ్చిన అతనికి ఓ టాస్క్ అప్పజెబుతారు పోలీసులు. దాన్ని ఎలా పూర్తి చేసుకున్నాడు? ఎలా బయటపడ్డాడు? అనేదే సినిమా కథ. ఇందులో అజయ్, టబుతో పాటు దీపక్ దోబ్రియల్, గజ్‌రాజ్ రావు, వినీత్ కుమార్ కీ రోల్స్ చేశారు. మార్చి 30న విడుదల కానుంది భోళా. తమిళంలో విడుదలైన ఖైదీ కన్నా ఈ సినిమా బావుంటుందని అంటున్నారు మేకర్స్.